Saturday, September 11, 2010

అవును.. విద్రోహమే..

వీర తెలంగాణ వేరు తెలంగాణ పురిటినొప్పులు పడ్తున్న ది. బయటపడ్డ పేగులను కడుపులో కాసెకట్టుకుని పోరాడిన ఎర్రజెండా తెలంగాణ. పారిన నెత్తురు పొత్తిళ్లకెత్తుకు ని పోరాడిన తెలంగాణ, విశాలాంధ్రలో ప్రజారాజ్యాన్ని ఓడిన తెలంగాణ ఇప్పుడొక ఆత్మగౌరవ కలను కంటున్నది. కల సాకా రం కానున్న సందర్భాన్ని కనురెప్పల కింద దాచుకొన్నది. ఇలాంటి ఈసందర్భంలో 1948, సెప్టెంబర్ 17.. విమోచన దినమా? విలీన దినమా? విద్రోహ దినమా? ఏడో నిజాం ఉస్మాన్ అలీఖాన్ ఓటమి దినమా? సర్దార్ పటేల్ విజయ దిన మా? ఏం పేరు పెట్టవచ్చు.


హైదరాబాద్ స్టేట్‌కు, విభజన తర్వాత హైదరాబాద్ స్టేట్‌లో భాగంగా రూపుదిద్దుకుని స్వతంత్ర రాష్ట్రంగా చెలామణి అయి, విశాలాంధ్రలో కలిసిపోయిన తెలంగాణకు స్వంత అస్తిత్వం ఏర్పడిందా? కొందరు భావిస్తున్నట్టు అది మిశ్రమ అస్తిత్వమా? దానికదిగా ఒక భౌగోళిక ప్రాంతపు ఆత్మగా చెప్పుకునే ఉమ్మడి ఉద్వేగ భావాల సమాహారం ఏర్పడలేదా? ఎన్ని ప్రశ్నలు.. సమాధానాలు లేవా? ఉన్నాయి.

కమ్యూనిస్టులు చూస్తున్న చూపుకు, భారతీ య జనతాపార్టీ దృక్పథానికి, ఇవ్వాల్టి అచ్చ తెలంగాణ అస్తిత్వ వాదుల లో- చూపుకు, ముస్లింల భావనలకు మధ్య 1948, సెప్టెంబర్ 17 ఒక ప్రహేళిక. అది విమోచన! విముక్తి ఏదీ కాద నే నుంచి విమోచనే! అనేదాకా ఇప్పుడొక చర్చ సాగుతున్నది. కానీ చరిత్రను ఎట్లా ఒడిసిపట్టి.. మనదైన నెత్తుటి చరిత్రను వర్తమానంలోకి లంకె కలపడానికి ఎవరికీ అభ్యంతరాలుండక్కరలేదు.

ఒక దినంగా జరుపుకుంటామనేకన్నా.. ఒక చరిత్ర గా ఎలాంటి వర్తమానానికి ఈ దినం బాటలు వేసిందనేదే ఇప్పటి అవసరం. 1948ని మాట్లాడుకోవడానికి ముందు తెలంగాణవాదులు 1952ను మాట్లాడుకున్నప్పుడు ఇది అచ్చంగా ఒక విద్రోహ దినంగానే కనబడ్తుంది. గైర్‌ముల్కీ ఉద్యమంలో సిటీకాలేజీ విద్యార్థులు అర్పించిన ప్రాణాల వెలుగులో దీన్ని చూడవలసే ఉన్నది. 'ప్రపంచంలో ఇప్పుడు మూడే మూడు దేశాలలో ఆక్రమిత సైన్యాలున్నాయి.
అవి జర్మనీ, జపాన్, హైదరాబాద్'-1952 'ఇడ్లీ సాంబార్ గోబ్యాక్' పోరు తర్వాత జరిగిన కాల్పుల సంఘటనపై విచారణ జరిపిన కమిటీ ముందు సరోజినీ నాయుడు కుమారుడు డాక్టర్ ఎన్.ఎం. జయసూర్య ఇచ్చిన వాంగ్మూలంలో ఈ మాటలన్నా రు. అంటే 1948 సెప్టెంబర్ 17 మొదలుకొని, నాలుగురోజుల్లోనే ముగిసిన యూనియన్ సైన్యాల పోలో ఆపరేషన్ నిజాం రాజ్యాన్ని విలీనం చేసుకున్నాయి. నిజమే.
కానీ.. ఆ తర్వాత జరిగిందేమిటి? 1948కి ముందు యూనియన్ సైన్యాలు నిజాంతో కుదుర్చుకున్న యథాతథ ఒడంబడిక సారాంశం ఏమిటి? ఎవరి నుంచి విమోచన కోసం యూనియన్‌సైన్యాలు హైదరాబాద్ స్టేట్‌లో ప్రవేశించాయి. 1948-51 మధ్య కాలం లో ఎంతమంది కమ్యూనిస్టుల ఊచకోత జరిగింది. ఎంతమంది ముసల్మానుల నెత్తురు ఏరులై పారింది. లక్షల లెక్క. ఎంతమంది దొరలు, భూస్వాములు, దేశ్‌ముఖ్‌లు, జాగీర్దా ర్లు.. రూమీటోపీలు ధరించి మళ్లీ గ్రామాల్లోకి చేరారు.

మూడు వేల గ్రామాల్లో ఎగరేసిన ఎర్రజెండాలు ఎట్లా వెలిసిపొయ్యా యి? పదివేల ఎకరాల భూమి ఏమయింది? గడీలు కూల్చి, గ్రామగ్రామానా దేశ్‌ముఖ్‌లను, జాగీర్దార్లను వాళ్ల కొమ్ముకాసిన నైజాంను, ఆయన మతసేనలను ధిక్కరించి, ఓడించి, తరి మి, గెదిమి గెలుచుకున్న భూములు ఎవరి పరమయ్యాయి. దొడ్డి కొమరయ్య, బందగి చిందిన రక్తం, చాకలి ఐలమ్మ.. బండియాదగిరి పాట ఎక్కడ మలిగిపోయింది.

ఈ ప్రశ్నలకు సమాధానం వెదికితే విమోచనమా? విలీనమా? విద్రోహమా? బయటపడ్తుంది. ప్రత్యేక అస్తిత్వం ఇప్పటి సందర్భమైనప్పుడు 1948, సెప్టెంబర్ 17న పీడకలలు కన్న ముసల్మానుల మనసు గెలుచుకోకుండా తెలంగాణ సాధ్యమేనా? ఒక త్యాగం కాదు. ఒక పోరాటం కాదు. తెలంగాణ ఒక యుద్ధభూమి. ధిక్కార భూమి. చరిత్ర వేరు. ఉద్వేగం వేరు కావొచ్చు.. కానీ.. తెలంగాణ చరిత్రంతా రణరక్త చరిత్ర.

అది కాకతీయుల మీద కత్తి దూసిన సమ్మక్క, సారక్కలు, జంపన్నవాగుల్ల, జాలారిబండ ల్ల వీరోచిత పోరు సలిపిన పగిడిగిద్దరాజు కావొచ్చు. ఢిల్లీ సర్కారు గుండెలదరగొట్టిన కాకతీయ ప్రతాపరుద్రుడు, రాణీరుద్రమలు కావొచ్చు. మొఘల్ ప్రభువు గుండె ల్లో నిదురించిన సర్వాయి పాపడు కావొచ్చు.. ఒకే మర్రి చెట్టు కు మూడు వందల మంది ఉరిపడ్డ శిరస్సులు చెప్పిన రహస్యం రాంజీగోండు కావొచ్చు. బ్రిటన్‌లకు సై అంటూ సవాల్ విసిరి కోఠి రెసిడెన్సీలో ప్రాణాలర్పించి తుర్రెబాజ్‌ఖాన్ కావొచ్చు.

గడీని ప్రశ్నించిన చాకలి ఐలమ్మ కావొచ్చు. గోండుల స్వతంత్ర పతా క ఎగరేసి బ్రిటన్, నిజాం తొత్తులను తుత్తునియలు చేసిన కొమురం భీం కావొచ్చు. భావ ప్రకటనా స్వేచ్ఛకోసం ప్రాణాలర్పించిన షోయబుల్లా ఖాన్ కావొచ్చు. తెలంగాణ అస్తిత్వమే రణ రక్త చరిత్ర.. పోరాటం ఊపిరిగా బతకడం. ధిక్కరణ. వందల ఏళ్ళ అవిశ్రాంత పోరాటం.. నిజమే.. బందగీ, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మల నాటికి సంగం ఉంది. కమ్యూనిస్టు పార్టీ లేదు.

కమ్యూనిస్టు పార్టీ సకల శ్రమ జీవుల భూమి, భుక్తి, విముక్తి పోరాటాలకూ తెలంగాణ నెత్తురు చిందింది. విశాలాంధ్రలో ప్రజారాజ్యం రాలేదు. అదీ అసలు విషయం.. ఇక ప్రారంభం. వలసలు పెరిగాయి. యూనియన్ సైన్యాలు ప్రతిష్ఠించిన రూమీ టోపీలతో పాటు, కామ్రేడ్స్ తోవలు చూపి న నల్ల రేగళ్ల భూముల పొంటి ఏర్పడ్డదే ఇవ్వాళ్టి సమైక్యవా దం.. చెబుతున్న నాజూకు మాటలు. మంచితనంతోనూ, సహనంతోనూ, శాంతి, ఓదార్పులకు ఆస్కారమిచ్చే విధంగానూ వాళ్లొచ్చారు.

ప్రజారాజ్యం నినాదం,మరోవైపు స్వాతంత్య్ర కాంక్ష.. ఎవరు స్వేచ్ఛ కోల్పోయా రు. ఎవరు భూమి కోల్పోయారు? ఎవరు నోటికాడి కూడు కోల్పోయారు. ఎవరు రావాల్సిన కొలువు కోల్పోయారు? ఎవరు కాలక్రమేణా యాభై నాలుగు సంవత్సరాలలో తమ ప్రాంతం తాము అడుగుతున్నందుకు విద్రోహులవుతున్నరు? దేశ ద్రోహులవుతున్నరు? అన్యాయాలను ఎలుగెత్తుతున్నందుకు ప్రాంతీయ సంకుచితవాదులవుతున్నరు.

దీనికిమూలం ఎక్కడ.. రెసిడెన్సీ పాలనలో నీటి పారకంలో.. ఎక్కితొక్కొచ్చిన పెట్టుబడులు .. పెరిగిన నయా ధనిక స్వామ్యం.. ప్రవహించిన పెట్టుబడులు.. మార్కెట్‌గా మారిన హైదరాబాద్ స్టేట్.. రెసిడెన్సీలో జరిగిన స్వాతంత్య్రోద్యమ పరిచయాలు, పలుకుబడి.. యూనియన్ సైన్యాల జయం తర్వాత కోస్తాంధ్ర పెట్టుబడులతో చెలిమి కట్టిందెవరు? నెవురయ్య రంగు బహిరంగమై.. ఇందిరమ్మ తెలంగాణను అణచివేసి.. ఇవ్వాల్టి దాకా.. నిజమే ఈ గడ్డమీద కమ్యూనిస్టు పోరాటం జరిగింది.

అది విఫలమైంది. గెలుపులు ఓటములయ్యాయి. కానీ ఆ పోరాట ఫలాలు చివరికి తెలంగాణకు వికృ త శిశువును ఇచ్చింది. పెట్టుబడికి ప్రవహించే స్వభావంతో పాటు సామ్రాజ్యవాద కాంక్ష ఉంటుంది. దానిఫలమే కదా తెలంగాణ అనుభవిస్తున్న వలసాధిపత్యం.. అది మాట్లాడుతు న్న తేనె పూసిన కత్తి మాటలు.. నాజూకు సన్నాయి నొక్కులు. అందుకే.. తెలంగాణ వాదులారా! అది విమోచనం కాదు.
విలీనమే. కానీ.. వలసలకది మూలమయినందుకు తెలంగాణకది విద్రోహ బీజాలు వేసిన దినమే. ఇక ఎవరి ఇష్టం వారిది. చరిత్ర ఒకటే.. తెలంగాణ పురిటిగడ్డ.. పోరాడుతూనే ఉన్నది. ఓడి పోతున్నా పోరాడుతున్నది. మొండాలతోనూ.. ఖండిత దేహంతోనూ అదిప్పుడు ఒకటే అడుగుతున్నది. ఇన్ని త్యాగాలు చేశాం..ఇప్పుడిక త్యాగాలు పుష్పించనీ.. ఫలించనీ.. మా ప్రాం తం మాగ్గావాలె. మా తెలంగాణ మాగ్గావాలె..