Monday, August 9, 2010

క్షతగాత్రం...

అంతా బాగానే ఉన్నట్టుంటుంది. మబ్బులు చెదిరినట్టు.. పొద్దు పొడిచినట్టు.. సూర్యకిరణంలా ఆశ వెలిగినట్టు.. ఆశను ఎలాస్టిక్‌లా సాగదీసినట్టు..కొద్దిసేపే.. జయం.. విజ యం.. మత్తింకా వదలక ముందే.. మళ్లీ ముసురు. మళ్ళీ రాజకీయ మబ్బులు. మళ్ళీ కమ్ముకునే చీకటిలాంటి దుర్భేద్యమైన అజ్ఞానపు, అహంకారపు రాజకీయ మాటల మూటలు.. తెలంగాణను రానివ్వరనే కంటే అనైతికంగా అడ్డుకునే వారెవ్వరనేదే అసలు ప్రశ్న. హేతువుకు అందకుండా, తార్కికతకు తావు లేకుండా.. బుర్రలో పుట్టిన బుద్ధి కొలమానాల అంచనాలు.

విశ్లేషణలు. ఆరోపణలు. అవహేళనలు. ఎకసక్కాలు. మళ్లీ ఎవర న్నా పిరికిపందలు ఆత్మహత్య చేసుకుంటే.. భయమేస్తున్నది ఇషాన్.. నువ్వొక పిరికి పందవి.. మైసమ్మకు మేకల్ని బలిస్తారు. నువ్వొక అమాయకపు మేకవి. నిన్ను నువ్వు బలిచ్చుకోవడానికి ఏం మిగిలిందని? ఎవడి గెలుపు కోసమో? ఎవడి ఓటమి కోస మో.. బావుల్లోకి ఉరుకుతున్న వాడా.. నువ్వొక బలిమేకవి.

నీది ఆత్మహత్యా! బహురూపుల రాజకీయ నేతలు చేసిన హత్యా! ఇషాన్ .. నీ శవం ముందు భీకర ప్రతిజ్ఞలు, కన్నీళ్ళు, వేదన, ఉక్రోశ, ఆక్రోశాలు.. కమ్ముకున్న దిగులు. మీ అమ్మ అట్లాగే ఉంది. దిగులు గూడులా.. మూటలా పడి ఉన్న నిలువు దుఃఖం మీ అమ్మ. ఏం చెబ్తావ్. ఇషాన్. తెలంగాణలో పుట్టిన వాడివి కదా. మాటలకు తూటాలు తొడిగే నేల మీద పడిన వాడివి. పారాడిన వాడివి కదా. బతుకు అంటే నిత్య సంక్షోభం, అనునిత్య పోరాటం అనే చోట కన్ను తెరిచిన వాడివి కదా. కొన్ని శవాలు.

కొన్ని ఛిద్రమైన కలలు. కొన్ని భావుకతలు. ప్రపంచ జ్ఞాన నేత్రం కూడా తెరుచుకున్న వాడివి కదా. ద్రోహులెవరో? తెలుసు. హంతకులెవరో తెలుసు. ఏ తీపి మాటల వెనుక ఎంత విషం ఉందో? తెలుసు. ఏం చెయ్యాలో ? తెలుసు. బాబ్లీ డ్రామాలు కనిపెట్టిన వాడివి. పోలవరం డ్రామాలతో పోదు. నిలబడి నిజపోరాటం చెయ్యమని కోరిన వాడివి. జ్ఞానం ఉన్న వాడివి. ఇషాన్. నిన్నిక కీర్తించలేను. ఆత్మహత్య నైతికతల ప్రకారం, అలౌకికతల ప్రకారం మహాపాపం. ఆత్మహత్య ఒక చేతగాని , చేవలేని, బలహీన మనస్కుడి అంతరంగ కల్లోలం. తెలిసి తెలిసీ, ఆత్మహత్య చేసుకున్నందుకు జీవితకాలం నిన్ను క్షమించలేను. కీర్తించలేను. అమరుడివన లేను.

వీరుడవనలేను. క్షమించు ఇషాన్. నీ కోసం మీ అమ్మ లాగే నేనూ రెండు వెచ్చటి కన్నీటి బొట్లు వదలగలను. కానీ.. అసహాయంగా నీ దేహం ముందు నిలబడి నిలువు శోకంలా .. నువ్వు మీ పెదనాన్ననీ, చిన్నాననీ.. నీ బాపునీ మోసం చేశావు. లౌకికతల ప్రకారం ఆత్మహత్య పిరికిందల చర్య. నిజమే. నీ తర్వాత కొంత పరంపర. రోజూ రెండూ మూడూ .. సంఖ్యలు భయపెట్టే సందర్భం. అంకెలు భీతి గొల్పే సమయమిది. నిజమే. మరు నిమిషంలోనే విజయాన్ని అవహేళన చేసినప్పుడు నారా జ్ అవుతాం. వాళ్లు కోరిన పరిధిలోనే.. వాళ్లు పెట్టిన షరతుల పరిధిలోనే. వాదం ఉంటే. గెలిచి చూపించమన్న పరిధిలోనే . నిలబడి గెలిచి చూపేదే అసలు తెలంగాణ.

ద్రోహ చింతన ఒకరిదని కాదు. చిదంబరంది. కేంద్రానిది. సోనియా గాంధీది. మాయమాటలు చెప్పే తెలంగాణ కాంగ్రెస్ నేతలది. అడ్డగోలు వాదన లు చేసే సీమాంధ్ర కాంగ్రెస్ నేతలది. రాజీనామాల అనంతరం గోసులు ఎగబోసుకుంటూ పోటీకి దిగిన భారీ కాయాల.. అంగుష్టపు బుద్ధులది. మెదడు నిండా ఒకే ప్రాంతపు అధిపత్యం. కళ్లల్లో రెండు నిలువు నాటకాలు.

అంగుట్లో అలవాటైన పచ్చి అవకాశ వాద పరిభాష. నిలువెత్తు మోసం. ఉద్వేగాలతో.. ఆడుకునే నీచం. నాయకుని బానిస. తెలంగాణ పోటీదారు. కన్నీళ్లలోనూ కల్మషం. ఏం చెప్పను పోటీపడి, సిగ్గులేకుండా నాటకాలాడి. తెలంగాణకు ఎదురీది.. ఎదురేగి, భంగపడ్డ బానిసల మాటలు ములుకులే. శరాఘాతా లే. అయితే మాత్రం. ఎవడు పట్టించుకుంటాడు. రుద్రభూమి నీది. ఎంత చరిత్ర చెప్పను. గెలుస్తా మా? నిలుస్తామా? సందేహాలు.. సందిగ్ధాలూ మనవి కావు. ఎక్కడ అక్రమం ఉంటుం దో, అక్కడ! ఎక్కడ అన్యాయం ఉంటుందో అక్కడ! ఎక్కడ రాజ్యం పడగ విప్పుతుందో? అక్కడ.

ఎక్కడ దోపిడీ మూలుగలు పీలుస్తుందో . అక్కడ దండోరాలు కొట్టి దండయాత్రలు చేసిన వీరభూమి మీద పడిన వాడా! పోరాటమే ఊపిరిగా ఎదిగిన నేల మీద. ఎన్ని చరిత్రలు ఎన్ని సార్లు చెప్పాలి. రక్తంలో పోరాట తత్వం ఉండాలి. రాదా! రాకపోయిన కానీ కొట్లాడు. విజయమో? వీర స్వర్గమో? ఒక నినాదం. కానీ.. ఎవరిని వారు కాల్చుకునే నిస్సహాయ, అసహాయ అవమాన సంస్కృతి ఎందుకు అబ్బింది ఇషాన్‌రెడ్డీ.. నిజమే. ఒకరు గెలిచినవి పదకొండే కదా! ఎవరివి వాళ్లకే అనవచ్చు.

నేరుగానే అవమానపరచవచ్చు. ఓటు వేయని నలభై శాతం మంది సమైక్యవాదులే అనే విదూషక రాజకీయ వేత్తా ఉండవచ్చు. పాత వాదనలను కొత్త తెరమీద కు తెచ్చి మనసును గాయపరచవచ్చు. న్యాయం ఏ పక్షం? మిత్రులారా! ఎవరి ది ప్రాంతీయవాదం! నిజ మే వెనుకబాటుతనం, ఆర్థికాభివృద్ధి, అంకెల గారడీ, నీళ్లూ, నిధులు, కాలువల మళ్లింపులు, సంస్కృతి.. చావుబతుకులు, భాష, యాస అరిగోసలు అనేకం చెప్పీ, చెప్పీ నోరు నొప్పు పుట్టి.. ఇక ఒకే ఒక మాట. ఏదీ లేదు. అసలు వాదనే లేదు.

ఒక ప్రాంతంగా విడిపోవడానికి.. ఉన్న హక్కుగామాకు తెలంగాణ కావాలె. వాదనలు బంద్. అది మీరిస్తే తీసుకొనేది కాదు. ఒక అమ్మ ఇయ్యడానికి.. ఒక అయ్య మూయడానికి తెలంగాణ దుక్నం కాదు. సమైక్యమో.. ఆంధ్రమో.. తెలుగో.. సమగ్రతో... దేశమో.. జాతో.. నీతో.. రీతో.. రివాజో..జాన్తానై. కలిసి ఉన్నాం. కుదరదనుకుంటున్నాం. అది మా ప్రాంతం మీద మా హక్కు. నక్సలైట్లో? దొరలో? దొంగలో? బద్మాషులో? దుర్మార్గులో? హంతకులో? ఎవరో ఒకరు.. ఒక ప్రాంతం స్థితి గతుల సంగ తి.. ఒక ప్రాంతం బాగోగుల సంగతి ఆ ప్రాంతానికి వదిలితేనే మర్యాద.

ఇదీ ఇషాన్.. నువ్వు చనిపోకుండా మాట్లాడాల్సిన మాట. అదే యూనివర్సిటీ లైబ్రరీముందు.. అదే ఆర్ట్స్ కాలేజీ ముంగట.. అదే యూనివర్సిటీ తారురోడ్డు మీద నెత్తురు కోలాటమాడిన వాళ్లంతా ధైర్యంగానే ఉన్నారు. జులుస్ తీసి జులుమ్‌లను ఎదిరించిన వాళ్లంతా ఇంకా మనసునిండా దట్టించిన ఉద్వేగాలతో నిలిచే ఉన్నారు. వాళ్లొక సభ అవుతున్నారు.

కదిలిపోతున్నారు. కన్నీరవుతున్నారు. కూడలిలో తమను తాము కూడగట్టుకున్న ఊరేగింపు అవుతున్నారు. ఒక కంట కన్నీరు.. మరో కంట నెత్తురు... తెలంగాణ జీవితమే అంత. అశ్రువొక్కటి ధారవోసిన త్యాగాల గడ్డ మాత్రమే కాదు. నెత్తురు చిందించిన వీరగడ్డ కూడా. ఆత్మహత్య ఎంతమాత్రం త్యాగం కాదు. ఆత్మహత్య ఎంతమాత్రం.. నీ ఆకాంక్షల సాఫల్య ఆయుధం కాదు. ఆత్మహత్యవద్దు.. ప్రియమైన పిల్లలారా! ప్రియమైన కనుపాపలారా! హంతకుడెవరు? అండమాన్‌లకు పంపాల్సిన రాజకీయ నాయకులే హంతకులు.

న్యాయం అడిగిన ప్రతిసారీ; ధర్మం అడిగిన ప్రతిసారీ.. రాజ్యాంగం ప్రసాదించిన విడిపోయే హక్కు అడిగిన ప్రతిసారీ.. బుల్లెట్లిస్తారు. సరే. భరిస్తాం. లాఠీలిస్తారు.. సరే నెత్తురోడుతాం. కానీ అబద్ధాలిస్తారు.. ఆటు మాటలిస్తారు. పోటు మాటలిస్తారు. అదే సమస్య. అదే కత్తి నేరుగా దిగనికుట్ర. పొడిచే పోటుకన్న మాయమర్మం. ఇప్పటి సమస్య.

అది కనిపెట్టి తిరిగినవాడే నేటి హీరో.. మార్మిక మంత్రాల మాయల మరాఠీ ప్రాణం దూరిన చిలకను మెడపిసక గలిగినవాడే నేటి హీరో.. కుట్రలనూ, కుతంత్రాలను ఎదిరించి నిలబడగలిగిన వాడే మొనగాడు.. వాడు వీధిలో రెండు కాళ్లు నిగడదన్ని నిలబడి నినదిస్తున్న ఆర్ట్స్ కాలేజీ విద్యార్థి..ఇషాన్ నిన్ను ప్రేమించలేను.. నిన్ను కీర్తించలేను. ఎవడు యుద్ధరంగంలో క్షతగాత్రుడయినా వీరోచితంగా నిలబడి ఉన్నాడో.. వాడికే నా వందనం.. హంతకుడు తెలుసు.. హంతకుడి మీద కత్తి ఎత్తిన వాడే కథానాయకుడు.

3 comments:

  1. Nice article. These writing are very much in need at this hour.

    ReplyDelete
  2. Allam Narayana garu, mee kavithalu anni chaduvuthanu... nenu kooda ee madyane rayadam modalu petta... oka sari veelu ayithe choosi salaha emanna ivvadaluchukunte thappakunda...

    http://telanganakavitvam.blogspot.com/

    Jai Telagana
    Srinivas Reddy

    ReplyDelete
  3. బ్లాగ్లోకానికి స్వాగతం అల్లం నారాయణ గారూ!

    కొణతం దిలీప్

    ReplyDelete