Saturday, August 14, 2010

ప్రతిమల పతనం

బౌల్డర్‌హిల్స్ అంటే రాతిగుట్టలు. దుబాయ్ కంపెనీ ఇంకా కట్టని విల్లాలకు పెట్టిన పేరది. కంపెనీ పేరు ఎమ్మార్ ప్రాపర్టీస్. ఈ రాతిగుట్టల కింద ఏడుగురు గ్రామదేవతలు సమాధయ్యారు. గ్రామదేవతలంటే వెంకటేశ్వరస్వామి అంతటి శక్తిసంపన్నులు కాదు గానీ, నానక్‌రామ్‌గూడలో ఎనభైనాలుగు పేద కుటుంబాలకు వాళ్లు దేవతలే. పోశమ్మ.. మైసమ్మ.. మారె మ్మ ఎవరైనా కావొచ్చు. వాళ్లకిప్పుడు దేవత లేదు. బొట్టుపెట్టి బోనం పోసుకుందామన్నా.. నైవేద్యం పెట్టుకుందామన్నా.. వాళ్లకు ఇక ఏ దేవతాలేదు.

దైవం సరే.. ఏడాదికో పూట.. కానీ రోజు పూట గడిచే అర ఎకరమో.. ఎకరమో పొలంకూడా లేదు. అదీ ఈ రాతి గుట్టల కింద కప్పడిపోయింది. అక్కడ ఇప్పుడు..విరామంతోనూ, తీరికతోనూ, తిన్నది అరగడానికి గోల్ఫ్ పచ్చిక మైదానాల మీద అడుగులో అడుగేసి, ఆరామ్‌గా గోల్ఫ్ గుంటల్లోకి బంతు లు కొట్టే పెద్దమనుషులు క్రీడలాడుకుంటున్నారు. నిజానికి నానక్‌రామ్‌గూడ ముత్యంరెడ్డి, సత్తెమ్మ, అంజిరెడ్డిల జీవితాలతో పెద్దలాడుకున్న
క్రీడలో వారి జీవితం ముగిసింది. బతుకుదెరువు ముగిసింది.

సుప్రీంకోర్టు దాకా వెళ్లి ఢిల్లీలనే గుండెపగిలి మరణించిన భూమిపుత్రుని జీవునం గొన్నది కూడా ఈ పెద్దమనుషుల క్రీడే. బహుశా భవిష్యత్తులో ఈ గోల్ఫ్ గుంటలకు బలిపెట్టిన రైతుల ఉసురు తగిలి విగ్రహాలు కూలిపోతున్న, పోయే దృశ్యాలు ఆవిష్కృతమవుతున్నాయి. అచ్చంగా ఆరు సంవత్సరాల క్రిందట చంద్రబాబునాయుడు నమూనాలో విస్మృతిలోకి, తీరని నిర్లక్ష్యంలోకి జారిపోయిన ఏ రైతుల కోసమని ఆయన బయలుదేరాడో? ఆ రైతుల ఉసురు తీసుకున్న పథకాలకు ఆయ నే నిర్మాత అయ్యాడు.

ఆయన పేరు దివంగత వై.ఎస్. ఆయన నమూనా పేరు పారిశ్రామిక అభివృద్ధి. ఇప్పటి సందర్భం నానక్‌రామ్‌గూడ. ఎమ్మార్ ప్రాపర్టీ. దుబాయ్ ప్రసా ద్. పార్థసారధి భవన్, ఆచార్య మార్గ్. కానీ ఈ సందర్భం ఏదైనా అయిదేళ్ల పాలనలో హైదరాబాద్ రింగురోడ్డు.. రహేజా లు.. రాంకీలు నుంచి మొదలుకొంటే సెజ్‌లు, ఫార్మాసిటీలు, నాలెడ్జ్ హబ్‌లు, బాక్సైట్ గనులు, బయ్యారంలు, ఓబుళాపురంలు, కృష్ణపట్నం, గంగవరాలు, సోంపేట బీలలు, వాన్‌పిక్ లు, కోస్తాకారిడార్‌లు... దున్నిపారేసి న పారిశ్రామక అభివృద్ధి కింద వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి రుమాలు చుట్టి, సింగేసి కట్టిన ధోవ తి రూపం.. ఎట్లా రూపు కడ్తున్నది.

ఇంకా రైతు బాంధవునిగానేనా? అదీ అసలు విషయం. విగ్రహాలు ప్రతిష్టించే కాలంలో విగ్రహాలు కూలే కాలం ఆసన్నమవుతూ ఉండడమే ఇప్పటి ఎరుక. రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముంచెత్తడానికి.. ఎవరినైతే విస్మరించారని.. పేరు చెప్పుకొని వచ్చారో? ఆ విస్మృత రైతు మనసు ను, గుండెను గాయపరిచిందెవరు? ఇప్పుడిక తేలాల్సి ఉన్నది.

పీవీ నరసింహారావు అయిదేళ్లు దేశ ప్రధాని. కరీంనగర్ జిల్లా వంగర ఆయన ఊరు. సోవియెట్ యూనియన్‌లో విగ్రహాలు కూలుతున్నప్పుడు, పెరిస్త్రోయికా, గ్లాస్‌నోస్త్‌లు విలసిల్లి గొర్బచ్యేవ్ విగ్రహం పాదుకొంటున్నప్పు డు, కాశ్మీర్ మండుతున్నప్పుడు, అలీ నం కూలుతున్నప్పుడు... మార్షల్ టిటో శవం సమాధుల్లో చింతిస్తుండగా స్లోవియాలు నిట్టనిలువునా చీలుతున్నప్పుడు పీవీ దేశ ప్రధాని. భారతీయ ఆర్థిక వ్యవస్థను బహిరంగ మార్కెట్లకు బార్లా తెరిచిన సంస్కరణల మూల పురుషుడు పీవీ.

ఆయ న నమూనాలే ఇవన్నీ.. అయినా చిత్రం. ఆయన విగ్రహం ఒక్కటీ లేదు. ఏ వీధిమూలనా చివరికి చిన్న గల్లీ మొగదలలో.. కనీసం వంగరలో కూడా ఆయన విగ్రహం లేదు. కానీ, కరీంనగర్‌కు దారి చూపుతూ మానేరు వంతెన దాటగానే ఎన్టీఆర్ విగ్ర హం ఒకటి ఉంటుంది. ఎన్టీఆర్ విగ్రహాలు ఊరూరా ఊరేగిన కాలం చెల్లిన తర్వాత వచ్చిన అచ్చరైతు వేషధారి, రైతు బాంధవుడు రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలు ఇప్పుడు ఊరూరా పాతుకుంటున్నాయి. బహుశా వేలల్లో.. కానీ కడపలో రాజశేఖర్‌రెడ్డి విగ్ర హం నిలువునా కూలిపోయింది. నేల పాలయింది.

రాతి గుట్టల మాటున దాగిన మనిషి బయటకు వస్తున్నప్పుడు ..నిజంగానే ప్రజల మనసుల్లో విగ్రహాలు కూలుతున్నాయి. ఇది అనివార్యం. వారసత్వం కోసం ప్రతిష్టించిన విగ్రహాలు కూలిపొయ్యే కాలం. పీవీ నరసింహారావును తలుచుకునే వారేలేరు. అవసరమో? అనవసరమో? అన్నది కాదిక్కడ ప్రశ్న. అయినా పీవీకి విగ్రహా లు లేవు. కూలిపోవడమూలేదు.

ఇదొక వైచిత్రి. వారసత్వం, కొనసాగింపులను మిం చిన ప్రయోజనమే దో ఉన్నప్పుడే దేవుళ్ల ను ప్రతిష్టిస్తారు. ఆత్మగౌరవం, తెలుగుజాతి గౌరవం, మహాస్రష్ట, మహాద్రష్టలు కూలుతున్నప్పుడు.. తెలుగు తల్లి విగ్రహం ఒక్కటే కాదు.. తెలంగాణ తల్లి మాటేమిటంటున్నప్పుడు.. ఒక ప్రాంతం లో ఎన్టీఆర్ ప్రాసంగికత శూన్యమే. బహుశా వారసత్వం కోసం అంగలారుస్తున్న వాళ్లకు బోధపడినట్టు లేదు. హరికృష్ణకూ అంతే. ఆ మాటకొస్తే జగన్‌మోహన్‌రెడ్డికీ అంతే.

వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి నిర్మించి ఇచ్చిన ఒక మహాసౌభపు పునాదుల మీద మహా సామ్రాజ్యాన్ని కలగంటున్నాడు జగన్‌మోహన్‌రెడ్డి. కానీ.. అదొక అద్దాల బంగ్లా.. రాళ్లు పడ్డప్పుడు తట్టుకోలేనివి.. అబద్ధపు పునాదులమీద నిర్మితమైన మహాసౌధాలు బీటలు పారుతాయి. కడప జిల్లా ప్రజల ఆకాంక్షలేవో? అసమ్మతులేవో? నోరు విప్పి చెప్పిన వారెందరో? చెప్పని వారెందరో? కానీ కడప జిల్లాకు వై.ఎస్.ఆర్. జిల్లా పేరు పెట్టినంత సులభం కాదు. చెప్పి న ప్రవచనాలకు, ఆచరించిన అక్రమాలకు మధ్య ఒక అబద్ధపు, ఇమేజరీ ఉంటుంది.

అబద్ధం బద్దలైనప్పుడూ.. అద్దాలూ భళ్లున బద్దలవుతాయి. కడపలో విగ్రహం కూలినట్టు. ఒక్క ఎమ్మార్‌కే కూలిపోయేది కాదది. ఉసురు తగులుతుందంటాడు నానక్‌రామ్‌గూడ అంజిరెడ్డి. ఆయనకా నమ్మకం ఉంది. చంద్రబాబు కిటికీలు తెరిచాడు. వై.ఎస్ బార్లా తలుపులు తెరిచాడు. వీళ్లిద్దరికీ మించిన ఆద్యుడు పీవీ. ఒక్క ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి విధ్వంసం పొరుకపోడు చేసిన రైతు జీవితాల ఉసురు.. బహుశా ప్రజల మనసు ల్లో నాటుకుంటున్న విగ్రహాలను కూల్చేసుకోవచ్చు.

జగన్ ఓదా ర్పు ఎవరి కోసం.. ఓదార్పు సరే.. ఎవరి మనసుల్లో ఎవరిని ప్రతిష్టించడానికి.. ఏ ప్రతిమలను శాశ్వతం చెయ్యడానికి? ఆ ప్రతిమలింకా పాతుకోక ముందే.. రాతి గుట్టలు అడ్డం పడ్తాయి. కోకాపేటలు, నానక్‌రామ్‌గూడాలు, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కింద వాడిపోయిన మల్లెతోటలు, బీలలు, సముద్రాలు, ఆక్రమించుకున్న గనులు, అడ్డగోలు కేటాయింపులు, నియామకాలు, మంజూరీలు, బంధుమిత్రులు.. వారసత్వ విగ్రహాలు మాటల కోటలు కడ్తుంటా యి. కానీ.. అవి పేక మేడల్లా కూలిపోయే రోజొకటి వస్తున్నట్టే ఉన్నది.

నిజమే. ఈ దేశం నెహ్రూ, గాంధీలది.. పీవీకి స్థానం లేదు. నిజ మే ఈ రాష్ట్రం.. ఎన్టీఆర్, వై.ఎస్‌లది పీవీకి స్థానం లేదు. కానీ.. పీవీలు శాశ్వతం కారు. వాళ్లకి విగ్రహాలూ లేవు. కూలిపోవడమూ లేదు. అదృష్టవంతులు. కానీ.. వారసుల పోరులో.. వారసుల ప్రయోజనాల కోసం ఏర్పడే ప్రతిమలు శాశ్వతం కాదు. తెలుగు తల్లికి తెలంగాణ తల్లి ఉంటుంది. విగ్రహాలు శాశ్వతం కాదు. విధి విధానాలు శాశ్వతం. అవి ఎవరి ప్రయోజనాల కోసం ఎవరు పనిచేశారో? నిరూపించేవి.. మరణానికి ముందూ.. వెనక ల తర్వాత..నమ్మకాలు కూలుతున్న దృశ్యం. ప్రతిష్టిస్తున్న ప్రతిమలు పతనమవుతున్న దృశ్యం.

(పీవీ బాబ్రీ మసీదుతో పాటు ఏర్పడకముందే కూలిపోయిన ప్రతిమ)

No comments:

Post a Comment