Saturday, August 28, 2010

యే షహర్ హమారా..

ఆప్ పర్ భీ ఫూల్ బర్‌సే: ఔర్ హమ్ పర్ భీ:
ఫర్క్ ఇత్నాహీహై: ఆప్ డోలీమే హై: హమ్ డోలేపే హై!

(మీపై పూలు కురిశాయి. మాపై కూడా కురిశాయి.
కానీ.. తేడా ఒక్కటే.. మీరు పల్లకిలో ఉన్నారు. మేము పాడెపై ఉన్నాము)
తండ్రీ.. ఈ హైదరాబాద్ ఎవరిది. ఆక్రమణదారులదా? ఇక్కడి భూమి పుత్రులదా? నిజమే.

పల్లకిలో ఊరేగుతున్నా రు. మేము పాడెపై ఉన్నాము. హైదరాబాద్ ఊరు పొందిచ్చిన మహమ్మద్ కులీ కుతుబ్‌షా 'నదిలో చేపలు నిండాలనుకున్నడు'..కానీ .. హైదరాబాద్ నదిలో షార్క్‌లు నిండాయి. కబ్జా చేసిన షార్క్‌లు. మొత్తాన్ని ఆక్రమించుకుని 'ఇటేటు రమ్మంటే ఇల్లంత నాదనే' చేపలు కావవి షార్క్‌లు.

ఎవరిదీ హైదరాబాద్. సర్పంలా చుట్టుకున్న రింగురోడ్డు పొంటి మేము లేము. మాల్స్‌లో లేము. మలేషియా టౌన్ షిప్పుల్లో లేము. కూకేటి పామైన కూకట్‌పల్లిలోనూ లేము. దిల్‌సుఖ్‌నగరూ, వివేకానంద కాలనీ.. వెంగళరావు నగర్, కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు, ఎల్వీ ప్రసాద్ మార్గ్, ఎన్టీఆర్ గార్డెన్స్, నెక్లెస్ రోడ్డూ.. హుసేన్‌సాగర్ ఒడ్డూ పొడవైన విగ్రహాల్లోనూ లేము.. పాతబస్తీలోనో, చార్మినార్ గల్లీలోనో? పుత్లీ బౌలీలో నో, రాజన్న బావిలోనో, లంగర్ హౌస్‌లోనో, మంగళ్ హాట్‌లోనో, బోరడంబలోనో కుదించుకుపోయి మూలనపడ్డ మూటల్లా పడి ఉన్నాము తండ్రీ.. విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలు, నూరంతస్థులు, ఏడుమేడలూ.. తండ్రీ.. మమ్మల్ని నెట్టేసుకు వెళ్లింది.

అభివృద్ధి రథం.. తెలంగాణ ముస్లిముల సంగతెందుకూ? మాట్లాడడం. ఉర్దూ భాషా పోయింది. సంస్కృతీపోయింది. పాతబస్తీ ఒక పరాధీన. కొత్త సొగసు లు. ఏవీ తండ్రీ.. ఒక్క ఫ్లైఓవర్ జాడల్లో నీలిగిన బతుకులు.. హైదరాబాద్ అంటే ఇప్పుడేది టావెర్నియన్ (ఫ్రెంచి యాత్రికుడు) పోల్చి చెప్పిన ఫ్రాన్స్‌లోని ఆర్లియన్స్ నగరం ఇదేనా?

మూసీలో మంచినీళ్లు నింపితే.. పారిస్తే.. ప్రవహిస్తే.. వెనిస్ నగరంలా తళుకు లీనేదీ ఇదేనా? అవొచ్చు.. కానీ ఆ మూల చార్మినార్ దాపల.. పక్షుల రెక్కలు టపటప కొట్టుకులాడం గ.. వెలిగే మక్కా మజీద్ దగ్గర.. సైకిల్ పంక్షరేస్తూ.. సామా న్లు తుడుస్తూ.. కడుగుతూ.. నెమలీకల విసనకర్రలు విసిరే ధూపం వేస్తూ.. బతుకు బండలైంది కద తండ్రీ.. పురానే యాదే.. పురానే దర్ద్.. ఒక్క ఇరానీ చాయ్ కోసం ఒక్క ఉస్మానియా బిస్కట్ కోసం..జిహ్వ చచ్చిందిరా.. ప్రాణం సొడసొడలు పోతంది. నాలుక గుంజుతంది.

గోల్కొండ కోట కింద, పాతబస్తీకింద, ఉస్మాన్ అలీఖాన్ పన్నులు పిండిన మరిగిన నెత్తురు క్రింద.. చంద్రబాబు ప్రపంచీకరణ క్రింద, రాజశేఖర్‌రెడ్డి బార్లా తెరిచిన.. బారాఖూన్ మాఫ్ కడుపు నింపుకున్న కార్పొరేటీకరణ క్రింద ఎవడి మల్లె తోటలున్నయి. ఎవరి చిల్లర దేవుళ్ల మూలుగులున్నయి.

ఎవరి వాగుల వంకల ఇసుక తుఫాన్లున్నయి. ఏఏ జిల్లాల కొండలు, గుట్టలు, చెట్లూ పుట్టలున్నయి... అవు నూ ఈ హైదరాబాద్ ఎవరిదీ? కన్నుగొట్టే లబ్బ రు బొమ్మల ముందు.. అడ్డాలో షోకేస్‌లా అంగ డి బొమ్మలా.. దేశదేశాల సంపన్న వర్గాల రణస్థలి.. రంగస్థలి.. అయిపోయిన ఈ హైదరాబాద్ ఎవరిది?

ఎవరి జీవునాలు ఎవరినెత్తుటి కన్నీళ్లింకితే ఇన్నేసి బంగ్లాలు.. ఇన్నేసి భూములు... కబ్జా పెట్టినోడు హైదరాబాద్ మీద హక్కు కోరుకోవడం.. ఎంత న్యాయం? ఏది ధర్మం? తెలంగాణ రక్త మాంసాల మీద.. తెలంగాణ రైతుల పుళ్లుపడ్డ చేతులు చేసిన వెట్టిచాకిరీ మీద నిర్మితమయిందీ నగరం.. పుట్టుక దానిదే.. చావూ దానిదే.. ఎప్‌బెల్‌లు, ఎమ్మార్ ప్రాపర్టీలు, మైక్రోసాఫ్ట్ లు, దివారాత్రులు నడిచే బాడీషాపు కంపెనీలు, అర్ధరాత్రుళ్లు మేల్కాంచే, దయ్యాలను కనే బ్లూచిప్ కంపెనీలు.. పొలారీస్ లు, ఇన్ఫోసిస్‌లు, విప్రోలు,తెప్పలు తెప్పలుగా వచ్చిన కార్పొరేట్ దేశీయ దళారీల మంద.. విదేశీల పాదాలు కడిగి తలమీద పోసుకునే.. మూక.. భాగ్యనగరం బహుళ జాతి కంపెనీల వాకిలయింది.. అది పొక్కిలయింది.

హైదరాబాద్ దురాక్రమణకు మూలం కొత్తగా చెప్పనక్కరలేదు. ఎవడి వనరుల మీద, ఎవడి మౌలిక వసతుల మీద..ఎవడి భూముల మీద నిర్మితమయిందీ నయా నంగనాచి నగ రం.. అది లెక్కతేలాలిప్పుడు..పెదవాగు పేగు ఎండిపోయినప్పుడు కదా..

ఇసుక లారీలు సర్రు న దూసుకొస్తేకదా.. సర్ఫెకాజ్‌లు, పారిపోయిన జాగీర్దార్లు పాయెగాల కోకాపేటలూ.. నిలవడి నిండి.. నిలువు భవనాలయినయి. పంట పొలా లు.. మల్లె తోటలు.. కూరగాయల పాదులు.. బర్రెలు మేసే పచ్చిక మైదానాలు.. పిల్ల కాలువ లు.. మల్లెల గంధం వీసే మట్టి భూముల్లో కదా... మీ కోటలు దాటిన అభివృద్ధి సౌధం నిలిచింది.

పదిహేడు లక్షల ఎకరాలలో పాతుకుపోతున్న మీ అభివృద్ధి నమూనాలో అవ్వల్ హైదరాబాద్ ఎక్కడ? ఎవరిదీ హైదరాబాద్.. హైదరాబాద్ తెలంగాణ గర్భం... తెలంగాణ కట్టుకు న్న కోట. ఆ మాటకొస్తే అది పొందిచ్చిన కులీకుత్‌బ్‌షాహీదీ కాదు.

మీర్ ఉస్మాన్ అలీఖాన్‌ది అంతకన్నా కాదు. ప్రపంచీకరణకు హైదరాబాద్‌ను బార్లా తెరిచి వందల వేల ఎకరాలు అప్పనంగా కంపెనీలకు అప్పగించిన చంద్రబాబుదీ కాదు. చంద్రబాబు దారిని వెడల్పు చేసి రింగురోడ్డుగా నట్టింట్లోకి సంపద దారులు వేసుకున్న రాజశేఖర్‌రెడ్డిదీ కాదు.. గవర్నర్ నరసింహన్‌ది అంతకన్నా కాదు..

ఒక ఆయన దీన్ని కేంద్ర పాలిత ప్రాంతం అనడానికి.. ఒక అవ్వ ..కాదుపో అనడాని కి.. హైదరాబాద్ ఎవడబ్బ సొత్తూ కాదు.. సామూహికతలో, సౌకర్యాలలో, స్వభావంలో.. అలంకారాలలో, ఆకర్షణల్లో, పోగొట్టుకున్నాం.. నిజమే..పొందడానికే ఇప్పుడు తెలంగాణ అడుగుతున్నవాళ్లకీ హైదరాబాద్ పంచాయితీ పదేపదే తెస్తున్న వాళ్లకీ..హెచ్చరిక. హైదరాబాద్ భూమి పంచాయితీ కాదు. ఆస్తి తగాదాకాదు.

అదొక పెట్టుబడి దుర్గంగా భావిస్తున్న వాళ్లకీ.. అమెరికాకు అమ్ముకునేందుకు నమూ నా నగరంగా ఊహిస్తున్న వాళ్లకీ..ఒకటే కొండగుర్తు. హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం గా తెలంగాణ ప్రజలు అంగీకరించరు. ఇది అన్నదమ్ములు పంచుకునే ఆస్తికాదు.

హైదరాబాద్ ఒక ఆస్తితగాదా కాదు. ప్రజల నెత్తురూ.. కన్నీళ్లు.. ప్రవహించిన సంస్కృతీ ప్రవాహం.. కాపాడుకోవడానికే ఈ కొట్లాట. బతుకుదాం అందరం.

కాదనడం లేదు. సికాకోల్ నుంచొచ్చిన సోంపేట కూలీ, పాలమూరు కరువు నుంచొచ్చి న కూలీ.. బతకడానికొచ్చిన ఐటీ కూలీ.. అందరం బతుకుదాం.. కానీ రామలింగరాజు ఆరువేల ఎకరాలు, జీవీకేల ఇరవై వేల ఎకరాలు.. ఆ సిటీలూ.. ఈ సిటీలు.. ఎమ్మార్ ప్రాపర్టీలు, ల్యాంకోలు, గోల్ఫ్ కోర్సులు, కండ్ల ముంగట హైదరాబాద్‌ను దోచుకున్న వారి సంగతి వేరు.. కోస్తా ఉత్తరాంధ్రా, రాయలసీమా, తెలంగాణ సామాన్య ఉద్యోగులారా! ఇక్కడ మీరున్నందుకు ఈ నగరం మీది కూడా.. హైదరాబాద్‌ను ప్రేమించండి అది మిమ్మల్ని ప్రేమిస్తుంది.

కానీ అదొక ఆస్తి తగాదా అనుకుంటే.. కొట్లాటవుతుంది.. ఇది అవాంఛనీ యం. హైదరాబాద్ తెలంగాణది. ఆనక అందరిది. కానీ..కేంద్రానిది కాదు.. కాబోదు..యే పురానా షహర్ హమారా!.. హమారాహీ రహేంగే.. రంగారెడ్డి.. నల్లగొండ,మెదక్, మహబూబ్‌నగర్‌ల భూములు, జాగలు, నదీ నదాలు.. కలిసి వెలసిన హైదరాబాద్ తెలంగాణది.



No comments:

Post a Comment